ఊరికి ప్రేమతో ...
ప్రపంచంలో ఏ మనిషికైనా తన ఉనికిని చెప్పుకోవడానికి కావలసినవి రెండు. ఊరు -పేరు. వరుస క్రమంలో కూడా పేరు కన్నా ముందు ఊరే వస్తుంది, ఎందుకంటే మనం పుట్టాక, పేరు (నామకరణం) పెట్టడానికైనా కొంత టైం పడుతుంది, కానీ పుట్టిన ఊరితో బంధం మాత్రం పుట్టిన వెంటనే మొదలైపోతుంది. ఒకవేళ మన సాంప్రదాయం ప్రకారం, ప్రసవం అమ్మమ్మ గారి ఊళ్లో జరిగినా.. ఊహ తెలిసాక, ఏ ఊర్లో మన బాల్యం గడిచిందో ఆ ఊరే మన ఊరుగా మారిపోతుంది.
అలా బాల్యం నుంచి ఎదుగుతున్న క్రమంలో ఆ ఊరి గాలీ నేలా, చెట్టూ చేమా, గుడీ బడీ, వాగూ వంకలతో.. మన అనుబంధం కూడా పెరుగుతూ వస్తుంది. ఇక బాల్య మిత్రులతో కలిసి చేసే అల్లరీ, ఆటలూ పాటలూ.. కాలువ జలకాల్లో జారిపోయే గోచీలూ, బచ్చాలాటల్లో వచ్చే పేచీలు, చెట్ల తోపుల్లో చెట్టాపట్టాల్, కోతి కొమ్మచ్చి, గూటీబిళ్ళా, గోళీలు..బొంగరాలు..బొమ్మ వాచీలు..మిఠాయి ఉంగరాలు..గాలిపటాలు..దీపావళి పటాసులు..అన్నీ అప్పుడు అమూల్య ఆనందాస్తులే. మరి కొంచెం వయసొచ్చాక చేసే సాహసాలు, నూనూగు మీసాల రోషాలు, కొత్త పరికిణీ ప్రేమలు – టూరింగ్ టాకీస్ సరదాలు, ఊరి పండగ సంబరాలు, పంచుకునే చిరుతిళ్ళు, స్కూల్లో మాస్టార్లు, పాఠాలు, కొత్త బెత్తం దెబ్బలూ, తెలిసీ తెలియని తెలివితో చేసే తప్పులూ, అవి నేర్పే గుణపాఠాలు..ఇలా ఒకటేమిటి, అన్నీ మధురానుభూతులుగా మిగిలే అంశాలే !
అందుకే చిన్ననాటి ముచ్చట్లు, సొంత ఊరి సరదాలు ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. ఈ క్రమంలో, పదమూడేళ్ళ క్రితం (2009) సాక్షి “ఫన్ డే ” మాఊరి ముచ్చట శీర్షికలో రాసిన” గణపతి పందిరి – నవమి సందడి ” కి వచ్చిన విశేష స్పందనా, తర్వాత కొన్నేళ్ళకి దాన్నే మళ్ళీ FB లో పోస్ట్ చేసినపుడు, భీమడోలు మిత్రుల లైక్స్, కామెంట్స్, ఫోన్లు, ప్రోత్సాహంతో..మరింత వివరంగా 1975 – 1985 నాటి మన భీమడోలు పరిస్థితులు, తీపి జ్ఞాపకాలు సంకలనంగా రాయాలనిపించింది.
ఈ విషయం ప్రకటించగానే, ముందుగా స్పందించి, దీనికయ్యే ” కళ-కాలం-ఖర్చు ” లకు స్పాన్సర్ చేసేందుకు, సహృదయంతో ముందుకొచ్చిన, ఊరిపై మమకారం మెండుగా ఉన్న సోదరులు, డా. కఠారి పుణ్యమూర్తి, డా. గుల్ల కృష్ణ చైతన్య, గంజి మజేష్ బాబు, బాలనాగు సుధీర్, పూజారి రాకేష్..అందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.. అలానే నా ఈ ప్రయత్నాన్ని మన భీమడోలు ప్రజలకు చేరువ చేసే- సోషల్ మీడియా సహకారాన్ని అందిస్తున్న సలాది శివ కి ( FB/మన భీమడోలు ) ప్రత్యేక అభినందనలు. వీరితో పాటు ఇలా ఊరిపై ప్రేమను తలా కొంచెం పంచుకునేందుకు ముందుకొస్తున్న పల్లె ప్రేమికులందరికీ ధన్యవాదాలు..
వీరి స్ఫూర్తి తో, ఈ ప్రాజెక్ట్ కి మరెవరైనా చేయూతనివ్వాలనుకుంటే Dr. కఠారి పుణ్యమూర్తి గారిని సంప్రదించ గలరు. అలాగే మన భీమడోలు తో మీ అనుబంధం – జ్ఞాపకాలు కూడా పంపిస్తే పరిశీలించి ప్రచురించడం జరుగుతుంది.
నా ఈ ప్రయత్నాన్ని, దేశ-విదేశాల్లో ఉన్న భీమడోలు ప్రజలందరూ ఆశీర్వదించి, మీ బంధు-మిత్రులకు, షేర్ చేసి మీ అందరి తోడ్పాటు అందించ ప్రార్ధన…
ఆన్ లైన్ ద్వారా స్పాన్సర్ చేసేందుకు 'QR Scan Code' for Online Payment Sponsors
Concept, Script, Illustrations & Web Designing
( suryatoons.com )
మా ఊరి రహదారి
For Sponsoring Support & Content Contribution Pl, Contact : info@suryatoons.com