bhimadoludays.suryatoons.com

Bhimadole-Canal-Road

Eluru to Bhimadole Canal Road

కాలువ గట్టు రోడ్ కీ.. రైట్..రైట్ !

ఏలూరు To తణుకు, తాడేపల్లిగూడెం వైపు వెళ్ళే బస్సు అంటే, మావూరు కాలువగట్టు వైపు వెళ్ళే బస్సు బయలుదేరుతుండగా ఎక్కేసాను. ఎదో ఒక విండో సీటు కోసం వెదుకుతుండగా -లక్కీగా ముందు డ్రైవర్ సీటు పక్కనే ఉన్న సీటు దొరికింది. ” ఆహ దీని తస్సాదియ్యా !..ఇప్పుడు ఒక పక్కేంటి ఆ పక్క గోదావరి కాలువ, పంట పొలాలు, ఈ పక్క పచ్చని చెట్లూ – హైవే తో సమాంతరంగా సాగే రైలు పట్టాలూ.. రెండూ Full Hd Display లో చూస్తూ..పాత రోజులు తలచుకొంటూ..ఎంజాయ్ చేయవచ్చు !

” రైట్..రైట్..కండక్టర్ కేకతో, బయలు దేరింది బస్సు.

ఫైర్ స్టేషన్ -ఫ్లై ఓవర్ ఎక్కగానే, కింద కనిపించే రైల్వే ట్రాక్స్. జూట్ మిల్ లోపలి షెడ్లు చూస్తే ..ఇప్పటి హైటెక్ డ్రోన్ కెమెరా ఏరియల్ వ్యూ ని, 40 ఏళ్ళ క్రితమే చూసిన ఫీలింగ్. అలా ముందుకు పొతే – ఏలూరు పాత బస్టాండ్ – ఊరికి మధ్యలో – మెయిన్ మార్కెట్ కి దగ్గర్లో వుంటుంది. ముఖ్యంగా మా భీమడోలు వైపు నుండి వచ్చే వారికి, ఏది కొనుక్కోవాలన్నా ఈ పాత బస్టాండే అనుకూలం, అందుకే ట్రైన్ కంటే చార్జీ ఎక్కువైనా కొంతమంది, భీమడోలు నుండి బస్సు లోనే వచ్చేవారు. చిన్నప్పుడు భీమడోలులో దొరకని, బుక్స్, VGS – రాఘవేంద్ర గోల్డెన్ గైడ్స్ కోసం ఏలూరు వచ్చి, మధ్యాన్నం మ్యాట్నీ చూసుకొని, సాయంత్రం తిరిగి వెళ్ళడం – ఓ సరదా !

ఈ రెండు బస్టాండ్స్ లాగానే ఏలూరు కి రెండు రైల్వే స్టేషన్లు వున్నా, పెద్ద స్టేషన్ ఊరికి దూరం, కాబట్టి మాకు పాసింజర్ ట్రైన్లు ఆగే “పవర్ పేట” స్టేషనే సౌకర్యం. (అలా.. ఇప్పుడు పాపులర్ ఐన “పవర్” పదం, మాకు చిన్నప్పుడే పరిచయం అయ్యిందన్నమాట ! )

ఇప్పడున్న పాత బస్టాండ్ – ఆశ్రం హాస్పిటల్ రోడ్, అప్పుడు లేదు. అక్కడంతా పెద్ద పెద్ద టింబర్ డిపోలు, సా మిల్స్, ఉండేవి. So, రోడ్డు వాహనాలన్నీ పెద్ద రైల్వే స్టేషన్ మీదుగా – ట్రాక్ దాటి వెళ్ళేవి. ఏలూరు లాకుల దగ్గర రైల్వే గేటు పడిందా..గోవిందా ! అంతే సంగతి..వెయిటింగే ..వెయిటింగు, ఒక్కోసారి వన్+వన్ బంపర్ ఆఫర్ లాగా, ఆపక్కా-ఈ పక్కా రెండు రైళ్ళు దాటేవరకూ గేటు ఎత్తేవారు కాదు. అంతసేపూ, బస్సుదిగి ఒక ‘టీ’ రెండూ కానిచ్చేయడం, కిటికీ ల పక్కన అమ్మే, తంపటి ఏడిశనక్కాయలు, జాంకాయలు, సీజన్ని బట్టి అమ్మే తాండ్ర, తేగలు, పుచ్చకాయలు, పనస తొనలు, సీతాపలక్కాయలు మేస్తూ కాలక్షేపం చేయడమే పని. అప్పట్లో అంత గిరాకీ వున్న ఆ యాపారమంతా, తర్వాత వట్లూరు గేటుకి, అక్కడా ఫ్లై ఓవర్ పడ్డాక – కాలపర్రు టోల్ గేటుకి, మారిందన్నమాట.

ఇక మన బస్సు, పాత బస్టాండ్ దాటి -ఆశ్రం హాస్పిటల్ దగ్గర హైవే ఎక్కేసింది. ఇప్పడు హైవే డబుల్ రోడ్ చేయడంవల్ల, డ్రైవెర్ మాంచి జాలీగా లాగించేస్తున్నాడు. కానీ RTC బస్సు కదా స్పీడ్ లాక్ ఉండడంవల్లనేమో ! ఎంత తొక్కినా 50 దాటడంలేదు. హైదరాబాద్ నుంచి వచ్చే మార్నింగ్ స్టార్, ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుల స్పీడ్ రేంజ్ కి అలవాటు పడి, ఈ స్పీడు ఆనడంలేదు.

అలా.. మధ్య మధ్య లో వచ్చే కిలోమీటర్ రాళ్ళు కౌంట్ డౌన్ చేసుకుంటూ, రోడ్డుకిరుపక్కలా ప్రకృతిని చూస్తూ, మనసులో – సూపెర్ స్టార్ కృష్ణ “గౌరీ” సినిమాలో “గల గల పారుతున్న గోదారిలా – రెపరెప లారుతున్న తెరచాపలా” పాటేసుకుంటూ రాగా “గుండుగోలు” వచ్చేసింది.

గుండుగోలు దాటామంటే..భీమడోలు వచ్చేసినట్లే.. తట్టా-బుట్టా వుంటే సర్దేసుకొని దిగడానికి రెడీ అయిపోవచ్చు.
అప్పటివరకూ కాస్త దూరంగా వున్న మావూరి గోదారి కాలువ, ఎడం పక్క షుగర్ ఫ్యాక్టరీ దగ్గరవుతున్నాయి.. ఆ షుగర్ ఫ్యాక్టరీ మావూరి పేద-మధ్య తరగతి యూత్,  ఎంతోమందికి తాత్కాలిక ఉపాధి కల్పించేది. Excursion కి వచ్చే స్కూల్ పిల్లలకు లోపల కెళ్ళి చూసే అవకాసం వుండేది. అలాగే నేను కూడా ఒకసారి లోపలికెళ్ళి చూడడం జరిగింది. లారీల్లో, ఎడ్డ్ల బళ్ల మీద వచ్చిన చెరుకు పెద్ద కాన్వేయర్ బెల్ట్ ద్వారా లోపలి పోవడం, యంత్రాలతో చెరుకు రసం-పిప్పి వేరవడం, పెద్ద పెద్ద ట్యాంకుల్లో పాకం మరగడం – అంచలంచెలుగా చక్కర గా మారి రావడం – కొసమెరుపుగా గుప్పెడు చక్కర నోట్లో వేసుకొని చోటా భీమ్ లా మురిసిపోవడం, మా వూరి చుట్టుపక్కల పిల్లలకి తెలిసిందే!

The-Andhra-Sugars-Factory-Bhimadole

షుగర్ ఫ్యాక్టరీ దాటి ఊరు దగ్గరవుతున్నకొద్దీ లోపల ఏదో తెలియని ఆత్రుత..నా నుండి నేనే ఒక బాలుడిగా లేచి, బస్సుకన్నా ముందు పరిగెడుతూ.. నా బాల్యాన్ని, నాకే చూపిస్తోన్న అనుభూతి. కిటికీ లోంచి వచ్చే ఎదురు గాలి చెవిలో చిన్ననాటి జ్ఞాపకాలు, తెరలు తెరలుగా చెబుతుండగా..కాలువ గట్టు స్టాప్ వచ్చేసింది. బస్సు దిగి తల తిప్పి చుట్టూ చూస్తుంటే.. సిరివెన్నెల ” ఈ గాలీ..ఈ నేలా..ఈ వూరు సెల యేరూ” పాట మదిలో – ఎకోలో ఒకేసారి వినిపించసాగింది.

 భీమడోలు డేస్-03 లో రా(య)బోయేది >> గోదారి కాలువలో గోచీలాట ! << అందాకా వేచి వుండండి.

_ సూర్య (చిన్నప్పుడు: ప్రసాదు) 23-07-2022

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *