bhimadoludays.suryatoons.com

Bhimadole-Godavari-Canal

Bhimadole Godavari Canal Memories

గోదారి కాలువలో గోచీలాట !

మా గోదారి కాలువ గట్టు..రూటే సపరేటు..! ఎలా అంటారా..సాధారణంగా ఊరంటే రోడ్డుకి ఆ పక్క – ఈ పక్కా విస్తరించి వుంటుంది. కానీ మా వూరు మాత్రం హైవే కి ఒక పక్క మాత్రమె వుంటుంది. మరోపక్క ఊరందరి భోజనానికి వడ్డించిన పచ్చని విస్తరాకులా, వరి పంట పొలాలూ, మధ్యలో మనకు పొలమారకుండా, పొలాలకు తడారకుండా నిండుగా ప్రవహించే గోదారమ్మ నీళ్ళు, మరో పక్క, భోజనం తర్వాత సేద తీర్చడానికి, రైల్వే స్టేషన్ లోని, పెద్ద పెద్ద నిద్ర గన్నేరు చెట్లు.. మొత్తంగా చూస్తే..పని పాటులతో అలసిన ప్రతి బతుకు బాటసారికీ ఆలనా పాలనా చూసే ప్రకృతమ్మ ఒడిలా..వుంటుంది..మా కాలువ గట్టు.

అందుకే బస్సు దిగి, ఊర్లోకి వెళ్ళాల్సి వున్నా..కాలవ గట్టునే ఇంకాసేపు గడపాలనిపించింది. కాలవలో దిగి నీళ్ళు తాకాలి, తాగాలి అనిపించింది, కానీ ఇప్పుడు కాలవ రేవు కళతప్పింది. హైవే (రోడ్) పెరిగి, కాలవ చిన్నగైనట్లుంది. లోనికి దిగడానికి మెట్లు పాడై, మట్టి చేరింది. ఒడ్డు పక్కంతా..మొక్కలు పెరిగి సగం కాలవను కప్పేసాయి. ఊరంతా కుళాయి నీటి సప్లై వచ్చేసి, వాష్ రూమ్ లు, వాషింగ్ మెషీన్ల వాడకాలు పెరిగాయోమో ! రేవు వాడకం మానేసారు.

కానీ మా చిన్నపుడు..ఈ కాలవ గట్టంటే..ప్రతి ఇంటి గడపకు తొలి మెట్టు లాంటిది. ఇంటిలోకి వెళ్లేముందు కాళ్ళు కడుక్కోడానికీ తొట్టిలో నీళ్ళు ఎలాగో, ఊళ్లోకి వెళ్లేముందు, కాళ్ళు కడుక్కోడానికీ, దోసిటతో నీళ్ళు తాగి, నెత్తిన చల్లుకోదానికీ ..ఈ రేవు అలాంటిది.

ఇది మా ఇళ్ళకి దగ్గర్లో, రైల్వే స్టేషన్ ఎదురుగా వుండే చిన్న రేవు. పూళ్ళ వైపు, వంతెన దగ్గరున్నపెద్ద రేవైతే.. గంగా-గోదారి ఘాట్ రేవులంత గొప్పగా వుండేది. పూజలూ – పుణ్య స్నానాలు, శార్ధకర్మలూ – తిలోదకాలకూ అనుకూలంగా, విశాలమైన మెట్లతో పవిత్రంగా వుండేది. గట్టున వున్న శివ – సుబ్రహ్మణ్య స్వామి గుడి, సుబ్బారాయుడి సష్టి కి అక్కడ జరిగే తిరునాళ్ళు.. అరటి తెప్పల్లో ఒదిలే కార్తీక దీపాలూ, వినాయకుడి నిమజ్జనాలూ.. ఇలా ప్రతి ఆద్యాత్మిక కార్యక్రమాలకూ, భక్తీ చింతనకూ కేర్ అఫ్ అడ్డ్రస్..మా వూరి పెద్ద రేవు.

నాకు క్షణం లో చావు తప్పి – ఈత అవసరం తెలిపి – నేర్పించింది ఈ రేవే..! అదెలా అంటే..

ఈ రేవు కంటే ఇంకా ముందు, గట్టూ..మెట్లు లేని మరో రేవు వుండేది. అక్కడ ఎడ్లబళ్ళూ దిగాదానికీ, గేదెలు, వాహనాలు కడుక్కోదానికీ అనుకూలంగా వుండేది. గణపతి నవరాత్రులు పూర్తయ్యాక, వినాయకుడి నిమజ్జనం కూడా అక్కడే చేసేవారు.

Bhimadole-Godavari-Canal-Ganesh-Nimajjanam

ఆవిధంగా, బాగా చిన్నప్పుడు ఒకసారి, వినాయకుడి నిమజ్జనం ఊరేగింపులో గంతులేసుకుంటూ వెళ్లి. నిమజ్జనం పూర్తయ్యాక, స్నానాలకి ఈ రేవుకి రావడం జరిగింది. విగ్రహం మినిగిపోయాక, వినాయకుడు మేడలో పూల దండలూ, అలంకరణలూ..కాలవ మధ్యలో నీటిపై తేలుతూ వస్తున్నాయి. వాటిని దక్కించుకునేందుకు కొందరు వంతెన పైనుంచి, ఒడ్డుననున్న ఎత్తైన దిమ్మ మీదనుంచి దూకుతున్నారు. వారితో పాటూ నేనూ కూడా దిమ్మపైనుంచి దూకేసాను.

అప్పటికి నాకు ఈతా రాదు, కాలువ లోతూ తెలీదు. ఇంకేముంది..దూకడం దూకడం తోటే నీటి అడుక్కి వెళ్ళిపోయాను, పైకి తేలితే కాళ్ళు అందడంలేదు, ఒడ్డూ, మెట్లూ చూస్తే రెండు, మూడు మీటర్ల దూరంలో వున్నాయి. మళ్ళీ మునిగే సరికి కళ్ళల్లో, ముక్కులో, నీళ్ళు వెళ్ళిపోయాయి. అయోమయంలో “కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నాను.

అంతలో ఒక మహానుభావుడు..నన్ను రక్షించాలని చేసాడో, లేక అతని ఈతకు అడ్డం వచ్చానని చేసాడో.. తెలీదు కానీ, నా మెడ పట్టుకొని ఒడ్డుకి, బలంగా తోసాడు. అ దెబ్బకి నీను విసురుగా వెళ్లి, నా కాళ్ళకి అందే మెట్టు దగ్గరికి చేరాను. కాస్త కంగారు, ఆయాసం, అయోమయం తగ్గేదాకా ఒడ్డున కూర్చొని, ” దీనమ్మా జీవితం – ఈత రాకపోతే నీటిలో ఇంత ప్రమాదమా” అనుకుంటూ ఇంటికి చేరాను.

తర్వాత నెమ్మదిగా, ఈ విషయం మా నాన్నగారికి చెప్పి, ఈత నేర్పించమని అడిగాను. ఆయనేమో మంచి ఈతగాడు, ఈత కొట్టకుండానే, వెల్లికిల్లా నీటిపై శవాసనం వేసే నేర్పరి. సరే అని రేవుకి తీసుకెళ్ళి, నా నడుముకి టవల్ చుట్టి, పట్టుకొని ఈత నేర్పించారు. ఆ విధంగా..నేను పెద్ద ఈతగాణ్ణి కాకపోయినా, కాలువ అంటే భయం పోయేంత వరకూ ఈత నేర్చుకున్నాను.

మా వూర్లో వేడి నీళ్ళ డ్రిల్ బోర్ (1976-77* దీని గురించి ప్రత్యేకంగా, రాబోయే స్టోరీల్లో రాస్తాను) వేసే వరకూ, నీటి అవసరాలన్నిటికీ, ఈ కాలువ నీరే ఆధారం. అక్కడక్కడా కొందరిళ్ళల్లో మాత్రం బావులు ఉండేవి.

రైల్వే క్వార్టర్స్, పోలీసు లైన్, వెలంపేట, మెయిన్ రోడ్డులో సగంవరకూ, స్టేషన్ దగ్గరి చిన్న రేవునీ – రైల్వే గేటు, సంత మార్కెట్, మెయిన్ బజార్, పెరుమాళ్ స్థంబం, గణపతి సెంటర్ వాళ్ళంతా వంతెన దగ్గరి పెద్ద రేవునీ వాడుకునేవారు.

ఇలా ఊరంతా, ఆడవాళ్ళు బిందెలతో, మగవాళ్ళు కావిళ్ళతో, కాలువనీరు మోసుకోవడం, మా దైనందిన జీవితంలో ఒక భాగం.
బాగా డబ్బు, పాడీ-పంటా వున్న మోతుబరి కుటుంబాలకు, పాలేర్లు నీళ్ళు మోసేవారు వారు.
మధ్య తరగతి మాస్టార్లు, ఉద్యోగులు, హోటల్ వాళ్ళు, నెలవారీ డబ్బులిచ్చి కావిడి వాళ్ళతో మంచి నీళ్ళు  మోయించుకునేవారు.

So, అంత కస్టపడి మోసుకున్న నీళ్ళు, ఇంటికి, వంటకి, ఆడోళ్ళ స్నానాలకి మాత్రమే వాడాలి. మొలతాడు కట్టిన మొగాళ్ళంతా, పిల్లలతో సహా, తుండుగుడ్డ మోసుకుని, గోచీతో మూసుకొని కాలువ స్నానం చేయాల్సిందే. కాకపొతే మన “సామాను” బట్టి – గోచీల సైజు మారుతుంది. అంతే ! మీరు చదివింది కరక్టే.. “సా..మానం” సైజే !!

అప్పటికింకా..మాకు లోపల డ్రాయర్లు వేసుకునే “ప్రత్యేక హోదా” రాలేదు. ఇంట్లో వాడకుండా పడేసిన ” ప్రతి దీర్ఘ చతురస్రపు – గుడ్డ ముక్కా.. మాకు గోచీనే !

మరి పెద్దోళ్ళంటే..రెండు పేట్ల మొలతాడు గట్టిగా కట్టి, పెద్ద పన్నా గోచీలతో..పకడ్బందీగా..రేవులో దిగే వారు. మా పిల్ల గాళ్ళకేమో “పెరిగే వయసని” లూజుగా..ఒంటి పేట, సన్న మొలతాడే..కట్టే వారు. దాన్లో రిబ్బన్ సైజు కోచీ దోపితే, వుంటుందా చెప్పండి.
నీటిలో దూకంగానే, వూడి కొట్టుకుపోయేది.

సరిగ్గా అప్పుడు పుట్టిందే మా “గోదారి కాలవలో – గోచీలాట” ఇది చెట్ల మీద ఆడే – కోటి కొమ్మచ్చికి “వాటర్ వెర్షన్” అన్నమాట !
నీటిలో మునిగీత కొడుతూ ఎవడో ఒకడిడి గోచీ లాగేయడం, వాడు మనదగ్గరికి వచ్చే సరికి, ఆ గోచీ వేరే వాడికి విసిరేయడం లేదా మళ్ళీ మునిగి ఈత కొడుతూ, వేరే చోట తేలడం. ఇలా గంటలు, గంటలు నీళ్ళలో గడిపి ఆడుకున్న రేవు ఇది.

అందుకే, అంత అనుబంధం వుంది కాబట్టే, బస్సు దిగి, ఊళ్లోకి వెళ్ళకుండా, ఈ రేవు దగ్గర ఇంతసేపు గడపాలనిపించింది. మరి ఊళ్లోకి వెళ్లేముందు.. మా వూరి రైల్వే స్టేషన్ సంగతులు కూడా చెబుతాను రండి !

భీమడోలు డేస్-04 లో రా(య)బోయేది >> ” రైల్వే స్టేషన్ – రింగ..రింగా రిక్రియేషన్ ” << అందాకా వేచి వుండండి.
మీ – సూర్య (చిన్నప్పుడు: ప్రసాదు) 26-07-2022

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *