bhimadoludays.suryatoons.com

Bhimadole-Railway-Station

Bhimadole Railway Station Memories

మావూరి రైల్వే స్టేషన్ – మరపురాని రిక్రియేషన్ !

మా భీమడోలు రైల్వే స్టేషన్ చూడ్డానికి చిన్నగా, మమూలుగా వున్నా, రెండు ప్రత్యేకతలు కలిగి వుంది.
ఒకటి: హైవే కి ఆనుకొనివుండడం, దీనివల్ల రోడ్డు రవాణా / రైలు రవాణా సరుకు అటు ఇటు మార్చుకోడానికి అనుకూలంగా వుండేది. ఇక ఊరు ప్రయాణాలకైతే, పొరపాటున రైలు మిస్ ఐనా..కంగారు పడకుండా, నాలుగడుగులు వేసి హైవే ఎక్కితే, బస్సో, లారీనో ఎక్కి, ఎటైనా  లాగించేయడానికి ఈజీ గా వుండడం.

రెండు: చిన్న తిరుపతి గా ప్రఖ్యాతి గాంచిన “ద్వారకా తిరుమల” కు (జంక్షన్) స్టేషన్ కావడం.
నిత్యం వచ్చే భక్తులతో, రైల్వే స్టేషన్ కళకళలాడుతూండేది. శనివారాలూ, పండుగలు, పెళ్ళిళ్ళ సీజనైతే..ప్రయాణీకుల తాకిడి మరీ ఎక్కువగా వుండేది. ఉదయం మాసిన గడ్డం, మొక్కు కోసం పెంచిన జులపాల జుట్టుతో వచ్చిన భక్తులు, సాయంత్రం బండి కోసం, తిరిగొచ్చే టప్పుడు నున్నని గుండూ, స్వామి వారి నామాలతో..జీయర్ స్వాముల్లా మారిపోయేవారు. వారి పిల్లల చేతిల్లో కొండపై కొన్న బొమ్మలు, బూరల మోతలతో..స్టేషన్ అంతా సందడిగా వుండేది.

మామూలుగా ద్వారకా తిరుమల బస్సు ఎక్కాలంటే రిక్షా లో భీమడోలు జంక్షన్ వరకూ వెళ్ళాలి. కానీ మా రోజుల్లో, శనివారాలు మాత్రం ఉదయం రెండు బస్సులు రైల్వే స్టేషన్ దాకా వచ్చేవి. ఇప్పుడు రిక్షాలు పోయి, డైరెక్టుగా తిరుమలకు మినీ వ్యాన్లు, షేర్ ఆటోలు మొదలయ్యాయి.

అలానే, ద్వారకా తిరిమల పరిసర ప్రాంతాల్లో తెల్ల సుద్ద (కయోలిన్ / చైనా మట్టి) గనులు ఉండేవి, వాటితో పింగాణీ (సిరామిక్) జాడీలు, టైల్స్, బ్రిక్స్ లాంటివి తయారు చేస్తారు. ఆ ముడి సరుకు అందుబాటులో ఉండడంవల్ల మావూర్లో కూడా రెండు మూడు జాడీల (సిరామిక్) కంపెనీలు ఉండేవి. అలా (ఊరగాయ) పచ్చడి జాడీలకు కూడా మాఊరు ప్రసిద్ధి చెందింది.

ఆ సుద్దని ఇతర రాష్ట్రాలకి ఎగుమతి చేయడానికి, మా వూరి రైల్వే స్టేషనే అనుకూలం, గనుల నుంచి లారీల్లో సుద్ద తెచ్చి, రైల్వే లూప్ లైన్ పక్కన డంప్ చేసేవారు. తర్వాత దాన్ని గూడ్స్ వ్యాగెన్ లలో, లోడ్ చేసి తరలించేవారు. దానికోసం ప్రత్యేకంగా (తూర్పు) నుంచి వచ్చిన కార్మికులు కూడా వుండేవారు. ఈ ట్రాన్స్ పోర్ట్ పనుల వల్ల, గూడ్స్ పెట్టెలు, రోజులూ, నెలలూ లూప్ లైన్లో నిలిచిపోయి ఉండేవి. అప్పుడు కాలువకి వెళ్ళాలంటే, వాటి కిందనుంచి దూరి వెళ్ళాల్సి వచ్చ్చేది.

ఆ సుద్ద, ప్లాట్ ఫారం, ఆ చివర నుండి ఈ చివరి దాకా విస్తరించి, చూడ్డానికి వెండి కొండలా మెరిసిపోయేది, వర్షాలు పడితే మాత్రం ఆదారిన వెళ్ళాలంటే కష్టం, ఎంత జాగ్రత్తగా నడిచినా జారిపడడం ఖ్హాయం !

crude-china-clay-kaolinite

మా వూర్లో అంతా, ఆ సుద్దనే ఇంట్లో ముగ్గులు వేసుకోడానికీ, కొంతమంది గోడలకి వెల్ల వేసుకోడానికి వాడుకునేవారు. అప్పట్లో అన్నీ మట్టితో కట్టి, పేడతో అలికిన ఇళ్ళు కావడం వల్ల, ఈ సుద్ద ముగ్గులు కూడా మట్టిలో బాగా ఇంకి, చాలారోజులు ఇల్లు-వాకిళ్ళు కళకళలాడుతుండేవి. పైగా ఎంత సుద్ద కావాలన్నా కొనక్కరలేదు. ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ ! మావూరోళ్ళకే కాదండోయ్, పాసింజర్ రైలు ఆగి, కదిలే లోపు ప్రయాణికులు కూడా, రెండు మూడు గడ్డలు సంచుల్లో వేసుకొని పోయేవారు. కొంతమంది దిగలేని, ఆంటీలు – అమ్మయిలైతే మాలాంటి, లోకల్ “చంటి” గాళ్ళ ను బతిమాలి రైల్లోకే అందించుకునేవారు. !

ఈ సుద్ద లాగానే, మరికొన్ని వస్తువులూ, చుట్టుపక్కల పంట ఉత్పత్తులూ, ఉప్పుడు బియ్యం లాంటివి కూడా, మా స్టేషన్లో ఎక్స్ పోర్ట్ అయ్యేవి. వాటిని గార్డ్ పెట్టికి ఆనుకొని వున్న లగేజ్ బోగీ వరకూ తోసుకెళ్లి, ఎక్కించడానికి ఒక పెద్ద ఇనుప ట్రాలీ వుండేది.
కానీ మా స్టేషన్లో ఆపని చేయడానికి సరిపడా పోర్టర్లు లేరు. అందులో ఒకాయన, నా బాల్య మిత్రులు మురళీ, ముఖర్జీ ల నాన్న. ఆయనకు హెల్ప్ చేయడానికి వారు. వారితో పాటూ నేనూ అవసరమైతే మరికొందరు తోటి పిల్లలూ వెళ్లి ట్రాలీ తోయడం, సరుకు బోగీల్లో వేయడం చేసేవాళ్ళం. అందుకు ఆయన వారి పిల్లలతో పాటూ, మాకూ రూపాయి, రెండు రూపాయిలు ఇచ్చేవారు.

అలా వచ్చే సరుకులో, తరచుగా వచ్చేవి తమలపాకు బుట్టలు. అవి వచ్చాయంటే, మాకు కాసుల పంటే..! అదెలా అంటే..
ఆ బుట్టలు సాయంత్రం రైళ్ళలో ఎక్కించడానికి వచ్చేవి. వాటిని ముందుగానే, లగేజ్ బోగీ ఆగే చోటికి, అంటే దాదాపు ప్లాట్ ఫారం చివరికి తీసుకెళ్ళి దింపుకోవాలి. అక్కడ జనాలు పెద్దగా వుండేవారు కాదు. పైగా చీకటి కూడా పడుతుండేది. అప్పుడే మాలోని పిల్ల “యమదొంగ” నిద్ర లేచేవాడు.

ఆ వెదురు బుట్టలకి పక్కా సీలు ఏమీ వుండేది కాదు. జస్ట్ పైన ఒక వెదురు మూత,  పురుకూసతో దూర దూరంగా కుట్టి వుండేది. ఆ పురుకూసని కొంచెం జరిపి, మూత పైకెత్తి, చేయి లోపలికి దూరిస్తే, ఆకులు చేతికి వచ్చేసేవి. దట్స్ ఇట్, అలా ఒక్కో బుట్టలోంచి తీసిన తమలపాకులు పక్కన పొదల్లో దాచుకొని, లోడింగ్ పని పూర్తయ్యాక, వాటిని పంచుకొని, గణపతి సెంటర్, ఎత్తు అరుగు వీరన్న కిళ్ళీ కొట్టులో అమ్మేయడం, వచ్చిన చిల్లరతో టూరింగ్ టాకీసు నేల టిక్కెట్ లో సినిమా చూస్తూ, ఇంటర్వెల్ లో జంతికెలూ..మస్సాలా వడలూ..తింటూ ” పుష్ప..పుష్పరాజ్” లెవెల్లో ఎంజాయ్ చేయడం. మాంచి కిక్కిచ్చేవి. ఏదేమైనా చిన్నప్పుడు చేసే చిలక్కొట్టుడు దొంగ పనులు ఇచ్చే కిక్కే వేరప్పా..అ..అ..!

అంతేకాదు, మా ఇళ్ళల్లో కుంకుడు కాయలు, గోడకి మేకులూ, స్కూల్లో గంటలు కొట్టడానికి వాడే ఇనుప సుత్తులు కూడా, మా రైల్వే స్టేషన్ పుణ్యమే ! రైలు పట్టాలు చెక్ చేయడానికి, పట్టాలపై తోసుకుంటూ వెళ్ళే ట్రాలీపై, ఎర్రజండా పట్టుకుని జాలీగా తిరిగి రావడం ఆ స్టేషన్ మాకిచ్చిన మధురమైన జ్ఞాపకం.

మా స్టేషన్లో పాసింజర్ రైళ్ళు మాత్రమే ఆగేవి. ఎక్స్ ప్రెస్ రైళ్ళు ఎక్కాలంటే ఏలూరు – తాడేపల్లిగూడెం వెళ్ళాల్సిందే. రైళ్ళు రావడానికి ఐదు – పది నిమిషాల ముందే గణగణ మని గంటకొట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి చివర్లో రెండు – మూడు గంటలు కొట్టేవారు. చివర్లో రెండు కొడితే గూడెం వైపు వెళ్ళేది, మూడు గంటలు కొడితే ఏలూరు వైపు వెళ్ళే రైలు వస్తుందని కోడ్ ! దగ్గర్లో..అంటే పోలీసు లైన్ వాళ్ళు, రాల్వే లైన్ వాళ్ళు, హోటళ్ళలో కాపీలు, టిపినీలు చేసే ప్రయాణీకులు ఆ గంటలు విని సర్దుకొని స్టేషన్ కి చేరుకోవడానికి, అలా గంటలతో ఎనౌన్సుమేంట్ చేసేవారు.

అలాగే, ఆ రోజుల్లో రైల్వే సిగ్నల్స్ కి కరెంట్ బల్బులు లేవు. కిరోసిన్ దీపపు బుడ్లు మాత్రమే వుండేవి. ప్రతి రోజు సాయంత్రం వాటిని తుడిచి, కిరోసిన్ నింపి, ఒత్తి సరిచేసి, స్టేషన్ నుంచి తీసుకెళ్ళి, సిగ్నల్ పైకెక్కి పెట్టి, వెలిగించి రావాల్సి వచ్చేది. ఈ పనుల్లో కూడా నేను, మురళీ ముఖర్జీ లకు తోడుగా వెళ్ళడం, సిగ్నల్ స్థంబం ఎక్కి పెట్టడం, సిగ్నల్ కంట్రోల్ కేబిన్ లో లివర్ లాగితే, అది పనిచేసే విధానం గమనించడం గొప్పగా వుండేది.

మా స్టేషన్ లో ఆగే పాసింజర్ రైళ్ళు అన్నీ బొగ్గు (ఆవిరి) ఇంజన్ తోనే నడిచేవి. వాటి “కూ..ఛుక్..ఛుక్.” చప్పుళ్లు, ఇప్పుడు వంటింట్లో వచ్చే ప్రెజర్ కుక్కెర్ “గాలి కూతల్ని” ఆప్పుడే మాకు పరిచయం చేసేసాయి. ఏదైనా ఎక్స్ ప్రెస్ క్రాసింగ్ వచ్చినప్పుడు, అదివెళ్ళేదాకా, పాసింజర్ బండి చాలాసేపు ఇక్కడే ఆగిపోయేది. అప్పుడు ఆ ఇంజన్లో డ్రైవెర్లను కూడా ఫ్రెండ్స్ చేసేసుకుని ఇంజను లోపలికెళ్ళి చూసి, వారి దగ్గర దొరికే ఇంజన్ “గ్రీజు” అడిగి తెచ్చుకొని, ఇంట్లో సైకిళ్లకు, కుట్టు మిషన్లకు, లీక్ అయ్యే ఇంకు పెన్నులకు వాడుకునేవాళ్ళం.

ఇక డీసెల్ ఇంజన్ తో నడిచే, ఎక్స్ ప్రెస్ రైళ్ళు, ముఖ్యంగా హౌరా మెయిల్ వచ్చినప్పుడు మాత్రం ఆ వేగానికి, పట్టాలు ” ధడధడలాడిపోయేవి. అంత వేగంగా వెళ్ళే ట్రైన్ పై కూడా, కొంతమంది “చడ్డీ గ్యాంగ్” కుర్రాళ్ళు పరిగెడుతూ, ఒక పెట్టి మీదనుంచి మరో పెట్టి మీదకి జంప్ చేస్తూ, ఎటువంటి “వైర్ వర్కు- గ్రాఫిక్స్” లేని, రాజమౌళి సినిమాని మాకు రియల్ గా చూపించే వారు.

అవి టీవీలు, మొబైల్ ఫోన్లు లేని రోజులు కావడంవల్ల, మా ఆటపాటల ‘రిక్రియేషన్” స్పాట్ కూడా.. ఈ రైల్వే స్టేషనే ! ప్లాట్ ఫారం చివర్లో గూటిబిళ్ళా, చెట్లపై కోతికొమ్మచ్చి ఆటలు, పట్టాలపై ఐదు, పది, పైసల నాణాలు, పిన్నీసులు, కూల్ డ్రింక్ మూతలుపెట్టి, వాటిపైనుంచి రైలు వెళ్ళాక, వాటి ఆకారాలు చూసి పడే ఆనందాలు, ఆగి వున్న బోగీల్లో దొంగాటలూ, గూడ్స్ పెట్టెలపై సుద్దతో బొమ్మలు గీయడాలూ..ఇలా, ఇల్లు-బడి తర్వాత ఎక్కువసేపు నా బాల్యం గడిపింది రైల్వే స్టేషన్లోనే.

అందుకే ఇలా, భీమడోలు వచ్చినప్పుడల్లా రైల్వే స్టేషన్ కు వచ్చి, చిన్నప్పుడు ఆడుకున్న ప్లాట్ ఫారం అంతా చూసుకొని, ఎదో ఒక బెంచీ పై కాసేపు కూర్చొని, ” నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ – గుర్తుకొస్తున్నాయి” పాటేసుకొని, ఆనాటి జ్ఞాపకాలు తాజా చేసుకొని వెళ్ళడం – ఓ అనిర్వచనీయ ఆనందం.

మీ -సూర్య (చిన్నప్పుడు: ప్రసాదు) 29-07-2022

భీమడోలు డేస్-05 లో రా(య)బోయేది >> “పోలీస్ గ్రౌండ్స్ – ఆటపాటలు అదుర్స్” << అందాకా వేచి వుండండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *