bhimadoludays.suryatoons.com

bhimadolu-days-story-surya-001

Chintalapudi to Bhimadole Night Journey

పోలీసోరి అబ్బాయి

     అది 1975వ సంవత్సరం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి గ్రామం, పోలీస్ కానిస్టేబుల్ కృష్ణ ప్రసాద్ గారి ఇల్లు.. ఆయనకు చింతలపూడి నుంచి భీమడోలు ట్రాన్స్ఫర్ కావడంతో కుటుంబమంతా ప్రయాణానికి సిద్ధమయ్యారు. భార్య – ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్లతో, ఇల్లంతా సామాన్లు సర్దేసి, లారీ కోసం ఎదురుచూస్తున్నారు. లారీ వచ్చేలోపు మరోసారి చుట్టుపక్కల వారికి వీడ్కోలు చెబుతూ మాటల్లోపడింది వారి భార్య భవానీ. అలా వారు భీమడోలు వెళ్లిపోతున్నందుకు, అందరికంటే ఆనందంగా ఉన్నది వారి ఆఖరి సంతానమైన, ఆరేళ్ళ అబ్బాయి బుజ్జి, ఎందుకంటే వాడు పుట్టింది భీమడోలులోనే, తర్వాత వారికి అక్కడి నుంచి చింతలపూడి ట్రాన్స్ఫర్ కాగా, ఇప్పుడు తిరిగి చింతలపూడి నుండి భీమడోలు ట్రాన్స్ఫర్ కావడంతో, తాను పుట్టిన ఊరికి తిరిగి పెడుతున్నందుకూ, ముఖ్యంగా.. చింతలపూడిలో లేని చుక్ చుక్ రైలు, కాలువ, కలువపూలు, చెరుకుగడలు, తెరచాప పడవలు.. ఉన్నందుకు వాడికి భీమడోలు అంటే అంత ఇష్టం ! వాటి గురించి తలచుకుంటూ, కలలు కంటూ, లారీ రాగానే తొందరగా ఎక్కేసి భీమడోలు చేక్కేయడానికి, చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు మన బుజ్జి గాడు. 

     అలా చూసి చూసి లారీ వచ్చాక సామానంతా ఎక్కించి బయలుదేరేసరికి రాత్రి చీకటి పడింది. అన్నలిద్దరూ లారీ క్యాబిన్లో కూర్చోగా, అమ్మ-అక్కతో కలిసి, లారీ వెనుక సామాన్ లతోపాటు వేసిన మంచం మీద పడుకున్నాడు మన బుజ్జి . లారీ ఊరు దాటి, రహదారి ఎక్కేసరికి చిక్కగా చీకటి పడి ఆకాశంలో చందమామ తొంగి చూశాడు, అలా కనబడిన చింతలపూడి చందమామ అక్కడే ఉండి పోకుండా తనతో పాటు భీమడోలు వచ్చేస్తుంటే ఆశ్చర్యంతో తెగ సంబరపడి పోతున్నాడు, మధ్య మధ్యలో ఆనందాన్ని అక్క తో పంచుకుంటూ, పండువెన్నెల్లో.. మబ్బుల చాటున దాక్కొంటూ.. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మల చాటున దోబూచులాడుతూ.. తనతోపాటు వస్తున్న చందమామను చూస్తూ నిద్ర లోకి జారుకున్నాడు.

     తెల్లారేసరికి లారీలో కాకుండా, భీమడోలు పోలీస్ లైన్, ఇంటి ముందు వాకిట్లో అదే మంచం మీద నిద్ర లేచాడు, నిద్రమత్తు లో కళ్ళు తెరిచి చుట్టూ చూస్తే.. ఇంటి ముందు విశాలమైన మైదానం (పోలీస్ గ్రౌండ్స్). అది చూసి, వాడి ఆనందం మరింత ఎక్కువయ్యింది, ఎందుకంటే.. ఆ వయసులో పిల్లలకి, అమ్మ ఒడి తర్వాత అంత ఇష్టమైనది ఆటస్థలం. అలాంటిది ఇంటిముందే అంత పెద్ద మైదానం ఉంటే.. ఇంక పిల్లల ఆటలకి, ఆనందానికి అంటుంటుందా !

     ఇక దూరంగా రోడ్డు పక్కన పోలీస్ స్టేషన్, గ్రౌండ్ కి ఒక పక్కన ఎస్ ఐ గారి బంగ్లా, మరోవైపు మంచి నీళ్ల దేవుడు చెరువు. పోలీసు లైన్ వెనకాల చిట్టడివిలా పెరిగిన తుమ్మ చెట్ల తోపు,  పోలీస్ లైన్ కి ఒకపక్క గండి సత్యం తాత ఇల్లు – మరో పక్క రజకుల ఇల్లు.. ఇవి తొలుత వాడికి పరిచయమైన ప్రదేశాలు.

పోలీస్ లైన్ లో ఉండే ఇళ్ళు కూడా, కాలనీలా కాకుండా ఒకదానికొకటి ఆనుకుని ఈ చివరి నుంచి ఆ చివరికి, రైలు పెట్టెల్లా ఉండేవి. పోలీస్ లైన్ వెనకాల ఉన్న తుమ్మ చెట్లని కొట్టి ఎండబెట్టుకుని వంటకి వాడుకునే వాళ్ళు, ఆ చెట్లని ఎంత నరికి నా మొదలునుంచి మళ్లీ మళ్లీ పెరుగుతూనే ఉండేవి. ఇక గ్రౌండ్లో మేతకు వచ్చే గేదెల పేడా- పిడకలు సరే సరి.

దాంతో పాటు లంబాడి వాళ్లు, అడవి కట్టెలను కూడా మోసు కొచ్చి అమ్మేవారు, ఆ రోజుల్లో ఇంటి దగ్గరికి అమ్మకానికి వచ్చే ఏ వస్తువు నైనా కొనడానికి డబ్బులే ఉండాల్సిన అవసరం లేదు, ఆ వస్తువు ధరను బట్టి బియ్యం తీసుకొని కూడా అమ్మే వారు. ఆకుకూరల నుంచి రేగిపళ్ళు దాకా అన్నీ దోసెడు బియ్యం వేస్తే చాలు, చేట నిండా ఇచ్చి వెళ్లేవారు. (ఇంకావుంది )

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *