bhimadoludays.suryatoons.com

bhimadoludays.suryatoons.com-eluru-bus-stand

Hyderabad to Bhimadole Via Eluru

మా ఊరికి రెండు రహదార్లు !

ఏలూరు కొత్త బస్టాండ్, అన్నయ్య గారి అబ్బాయి శ్యాం, శనివారపు పేట ఇంటినుంచి బండిమీద డ్రాప్ చేసి ” Ok బాబాయ్ – వెళ్లి మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసి రండి – బాయ్ ” అంటూ వెళ్ళిపోయాడు.

అప్పటికే పెద్ద పండక్కి వచ్చినవారు ఊళ్ళకి చేరుకున్నారు కాబట్టి ప్రయాణాలు తగ్గి, బస్టాండ్ లోపల జనం మరీ ఎక్కువగా కాకుండా ఓ మాదిరిగా వున్నారు. వాస్తవానికి నేనుకూడా పండక్కి అన్నయ్య గారింటికి వచ్చాను కాబట్టి అక్కడే వుండాలి, కానీ హైదరాబాద్ నుండి ఇంత దూరం వచ్చి, నేను పుట్టి – పెరిగిన ఊరు చూడకుండా వెళ్ళడానికి మనసొప్పక, వచ్చిన ప్రతి సారీ చేసే ప్రయాణమే ఇది.

సరే బస్టాండ్ లోపల, హైదరాబాద్ బస్సు ప్లాట్ ఫారం వైపు నుండి చూసుకుంటూ పొతే మరో చివర వుంటాయి – తణుకు, తాడేపల్లి గూడెం, నరసాపురం బస్సులు, వాటి పక్కనే ద్వారకా తిరుమల, రాజమండ్రి వైపు వెళ్ళే బస్సులు. అక్కడ మొదలుతుంది అసలు సమస్య, ఎటువైపు వెళ్ళే బస్సు ఎక్కాలా అని ! ఒక్కోసారి ఇంటినుంచి, బయలుదేరేటప్పుడే పక్క ప్లాన్ తొ వచ్చినా – ఇక్కడకు వచ్చాక తారుమారు అవ్వడం జరుగుతుంది. అందుకని అలా ముందస్తు ప్రణాళికలు మానుకోవడం జరిగింది.

అదేంటి “యే ఊరు వేళ్ళలో – ఆ ఊరు బస్సు ఎక్కకుండా – ఎదవ ఎగస్ట్రాలు చేస్తున్నాడు” అనుకుంటున్నారా !?. అయ్ బాబోయ్ ! అదేనండి మావూరి స్పెషల్ ప్రత్యేకత. మా వూరికి ప్రత్యేకంగా ఒక బస్సంటూ లేదండీ .. కానీ రెండు – మూడు రూట్లలో వెళ్ళే బస్సులన్నీ మాఊరు వెళ్తాయండి. అదిగో- మళ్ళీ ఎకసేక్కలానుకుంటున్నారా ! నిజమేనండీ బాబూ.

ఎలాగంటారా..మాఊరు అదేనండీ ” భీమడోలు – The Great ( అవునండీ – నాకు అదే నా చిన్నప్పటి ” మాహిష్మతీ ” సామ్రాజ్యం) రెండు రహదారుల మధ్యలో వుంటుంది. ఒకటి కలకత్తా వైపు నేరుగా వెళ్ళే రహదారి. రెండోది గుండుగోలు దగ్గర విడిపోయి రాజమండ్రి పోయే రహదారి. So, నరసింహ లో రజనీ కాంత్ కి, ఒక్కటే రహదారి, కానీ మా భీమడోలోళ్ళకి మాత్రం రెండు రహదార్లు. హ..హ..హా. ( లోపల రజనీకాంత్ ఇన్ షర్టు తీసి ఎనక్కి ఎగరేసి నవ్వుతున్నట్లుగా ఊహించుకోండి )

సరే. ఇక బస్టాండు లో బస్సులు ఒక్కొక్కటి వచ్చి పోతున్నాయి, సత్తుపల్లి, భీమవరం, విసన్నపేట- వగైరా.. వగైరా..! సాధారణంగా మనం వెళ్ళాల్సిన బస్సు ఆలస్యమైతే..కొంచెం విసుగ్గా వుంటుంది, కానీ నాకు మాత్రం అదికూడా – ఒక ఆనందమే, ఎందుకంటే హైదరాబాద్ లో వుండీ వుండీ మిస్ అవుతున్న మా గోదారోళ్ళ భాష – యాస చెవుల నిండా వింటానికి అదే మంచి టైం ! అదేంటి బస్సు లోకూడా వినొచ్చు అంటారా ! భలే వోల్లండీ బాబూ, మా వొళ్ళు మామూలోళ్ళు కాదండీ, బస్సు ఎక్కగానే – మా రోడ్ల ఉయ్యాలా జంపాలకీ.. అందరూ కునిపాట్లు మొదలెట్టేస్తారు, ఇంకా మాటలెక్కడ వుంటాయి ! ఇక బస్సు పాత బస్టాండు, ఆశ్రం హాస్పిటల్ దాటిందంటే, దెందులూరు దాకా, దిగేవాళ్ళ కోసం, కండక్టర్ -మన దగ్గిరకొచ్చి రాడ్ మీద ఠపీ..ఠపీ మని కొట్టి లేపితేనే లేచి దిగుతారు. ఆయ్ !

ఆ విధంగా..మావోళ్ళ ” ఏరా..ఒరేయ్..యాండీ..మరే..ఆయ్” మాటలు వింటూ ఉండగానే..
డ్రైవర్లిద్దరూ.. బావా-బామ్మర్డుల్లగా – రెండు రూట్ల (రహదారుల) బస్స్సులూ ఒకేసారి తీసుకొచ్చి, ప్లాట్ ఫారంలపై పెట్టారు. మళ్ళీ నాకు విషమ పరీక్ష మొదలైంది. యే బస్సు ముందొస్తే అదేక్కేద్దామనుకుంటే..ఒకేసారి రెండు బస్సులు ! ఒక రూటు బస్సెక్కితే, కాలవ గట్టు (రైల్వే స్టేషన్) దగ్గర దిగి వూరు చూసుకుంటా, జంక్షన్ వైపుకి రావచ్చు. మరో రూట్ బస్సు ఎక్కితే జంక్షన్ వైపు దిగి వూరు చూసుకుంటా కాలవ గట్టుకి రావచ్చు. ఏదైనా ఒకటే..అయినా ఏది ఎక్కాలో తేల్చుకోడానికి బుర్ర గిర్రున తిరగాల్సిందే..

ఇక్కడ మన ఇంటిలిజేన్సూ, కంఫోర్ట్ లాంటి వాటిని వాడి, యే బస్సులో మంచి విండో సీటు ఖాళీ వుందో, యే బస్సు కిటికీ అద్దాలు దుమ్మూ-ధూళీ లేకుండా క్లియర్ గా వున్నాయో, యే బస్సులో కండక్టర్ చిర్రు బుర్రులడకుండా ప్రేమగా పిలుస్తుందో లాంటి వాటితో బేరీజు వేసుకొని, ముఖ్యంగా ముందు యే బస్సు బయలుదేరుతుందో, చూసుకొని ఎక్కేసి మన భీమడోలు ప్రయాణం మొదలై.. సాగుతూ (ఇంకా) వుంది.
_ సూర్య (చిన్నప్పుడు: ప్రసాదు) 20-07-2022

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *